రాష్ట్రంలో సామాన్య ప్రజల సాధకబాధకాలపైనే తమ దృష్టి కేంద్రీకృతమైవుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.... అనుకోని పరిస్థితుల్లో పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతోందని గుర్తు చేశారు.
అభివృద్ధి పథకాల్లోని లొసుగులవల్ల కొందరు అనర్హులు కూడా ప్రభుత్వ సౌకర్యాలు పొందడం కొంతమేరకు వాస్తవమేనని సీఎం అంగీకరించారు. దీనిని తాము సమర్థించబోమని, అలాంటి లోపాలను తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అభివృద్ధి పథకాల్లో అక్కడక్కడా లోపాలు చోటుచేసుకున్నా, అమలు చేయడంలో దేశంలోనే తొలిస్థానంలో నిలిచామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో జుట్టు పన్ను మినహా మిగిలిన అన్ని పన్నులు వేసి ప్రజల నడ్డివిరిచారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఇప్పుడు పలు ప్రజా సంక్షేమ పథకాలకు తెదేపా అడ్డుతగులుతోందని ఆయన దుయ్యబట్టారు. పథకాలు, ప్రణాళికలపై పాలకపక్షంతో కలిసి శాసనసభలో సజావుగా చర్చించడం ప్రతిపక్షాల కర్తవ్యమని వైఎస్ గుర్తు చేశారు. దీనికి భిన్నంగా తెదేపా సభలో నడుచుకుందని విమర్శించారు.
|