మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీకే తీవ్ర నష్టం వాట్లిల్లుతుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సోమవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ... బియ్యం ధరలు నింగినంటుతున్న తరుణంలో వాటిని అదుపుచేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు చెప్పారు.
కాగా ఆరు నెలలకు మించి ధాన్యం నిల్వలు ఉంచిన రైస్‌మిల్లుల యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే కాపు, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల ఆదాయ పరిమితిని లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అనంతరం ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌లో స్టార్ హోటల్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జీవక్రాంతి పథకానికి మరో పది కోట్ల రూపాయలను కేటాయించారు.
సుమారు పది లక్షల గొర్రెలకు జీవిత బీమా కల్పించే పథకానికి క్యాబినెట్ ఆమోదించారు. దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కొరత వల్ల అన్నదాతలు చేపడుతున్న ఆందోళనలు, ఎరువుల కొరతను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలు చర్చించారు.
|