ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రాంత ఆస్తులను కాంగ్రెస్ నాయకులు రాబందుల్లా దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని తెదేపా సవాలు విసిరింది. అలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినట్లైతే తక్షణం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని టీడీపీ తెలిపింది.
ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చి, తెలంగాణ ప్రజలను మోసం చేసిన పాలక ప్రభుత్వానికి తెలంగాణపై మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదని తెదేపా ఎంపీలు ఎర్రన్నాయుడు, ఎర్రెబెల్లి దయాకర్‌లు పేర్కొన్నారు.
తెదేపా కోర్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణ కార్యక్రమం త్వరలో ఒక రూపానికి వస్తుందని, ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో భాగంగా తెలంగాణపై అభిప్రాయ సేకరణ చేస్తామని వారు చెప్పారు. ప్రణబ్ కమిటీలా తెదేపా కోర్ కమిటీ కాలయాపన చేయబోదని, అలా చేస్తే ప్రజలు తమనూ నమ్మబోరని తెదేపా నేతలు వ్యాఖ్యానించారు.
|