తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశంపై రెండో దఫా అభిప్రాయ సేకరణకు సంబంధించి ఈ సమావేశంలో చర్చలు జరుపనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. తెదేపా కోర్ కమిటీ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 130 మంది పార్టీ నేతలు హాజరయ్యారు.
ఈ సమావేశంతో ప్రత్యేక తెలంగాణపై తెదేపా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ అంశంపై అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుంది? అనే అంశంపై కూడా భిన్నకోణాల్లో చర్చలు జరుగుతున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఇదిలా ఉండగా, తెదేపా కోర్ కమిటీ వచ్చే మూడు రోజుల్లోనే నివేదికను సమర్పించే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశంలో తెదేపా ఇతర పార్టీలతో కుదుర్చుకునే పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో నాగం జనార్దనరెడ్డి, యనమల రామకృష్ణుడు, ఎర్రబెల్లి దయాకరరావు, రె. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
|