ప్రత్యేక తెలంగాణపై తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం సరైందేనని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ విషయంపై తెదేపా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం ఏమాత్రం సరికాదని గౌడ్ తెలిపారు.
అయితే పార్టీలో కొన్ని తెలంగాణా వ్యతిరేక శక్తులు ఉన్నాయని, తెలంగాణ నేతలంతా కలిసి అధిష్టానానికి వాస్తవాన్ని వివరించాల్సిన అవసరం ఉందని మధుయాష్కీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, తెరాసను ఎదుర్కోవాలంటే పార్టీ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఉప ఎన్నికల్లో ఒవైసీ ప్రచారం చేసినా ముస్లింల ఓట్లు ఎటుపోయాయని మధుయాష్కీ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ఒవైసీ ముస్లింలందరికీ ప్రతినిధి కాదని, వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసేదెవరని అధిష్టానమే నిర్ణయిస్తుందని యాష్కీ స్పష్టం చేశారు. ముస్లింలు తెలంగాణా కోరుకోవడం లేదన్న ఒవైసి, వైఎస్ వ్యాఖ్యలతో యాష్కీ విభేదించారు. |