రానున్న అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ మెజార్టీ పార్టీగా అవతరిస్తుందని ఆ పార్టీ నేత నాగేంద్ర బాబు జోస్యం చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రజారాజ్యం పార్టీ పట్ల వారి పూర్తి మద్దతును అందించడమే ఇందుకు నిదర్శనమని.. ఆయన వ్యాఖ్యానించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరలో పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన అనంతరం నాగేంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 200 స్థానాల్లో 20వేలకు పైగా మెజార్టీతో ప్రజారాజ్యం పార్టీ గెలుపొంది... సంచలనం సృష్టించడం ఖాయమని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.
పలు జిల్లాల్లో పార్టీ కార్యకర్తల మధ్య విభేధాలు తలెత్తిన మాట నిజమేనని చెప్పిన నాగబాబు... ఆ సమస్యలను పరిష్కరించేందు కోసం సమన్వయ కమిటీలను ఆయా ప్రాంతాలకు పంపామని వివరించారు. తాను పార్టీ నేతను కానని.. కేవలం కార్యకర్తనేనని.. తెలిపారు. కాగా, నవంబరులో పార్టీ శ్రేణులకు శిక్షణను ప్రారంభించనున్నట్లు ప్రజారాజ్యం పార్టీ ప్రకటించింది.
ఈ విషయాన్ని పుచ్చలపల్లి మిత్ర, పరకార ప్రభాకర్‌లు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తాంగా 5.5 లక్షల మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇప్పించనున్నట్లు వ్యాఖ్యానించారు. |