రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తూ.. 'ఇంద్రసేనా' వైభవాన్ని తలపింపజేస్తున్న మెగాస్టార్ 'ప్రజా అంకిత యాత్ర'కు చెక్ పెట్టే దిశగా ప్రధాన తెలుగుదేశం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులోభాగంగా నందమూరి వంశ అగ్ర హీరో బాలకృష్ణను సీమ యాత్రకు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక షూటింగ్ నిమిత్తం విదేశంలో ఉన్న బాలకృష్ణ.. వచ్చేనెల పదో తేదీన రాష్ట్రానికి వస్తారు. ఆ తర్వాత మెగాస్టార్ రోడ్‌షోలకు ధీటుగా నందమూరి హీరో యాత్రలు నిర్వహించాలని తెదేపా నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి అధిష్టానం కూడా ఆమోదముద్ర వేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. తెదేపా వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు స్వర్గీయ ఎన్టీరామారావు పట్ల రాయలసీమ వాసులు ప్రత్యేకాభిమానం చూపించేవారు. రాయలసీమ జిల్లాల్లో కరువు విలయం తాండవం చేసిన సమయంలో ఎన్టీఆర్ స్వయంగా చందాల రూపంలో నిధులు సేకరించి ఆ ప్రాంత ప్రజలకు సాయం చేశారు. అంతేకాదు ఆయన నటించిన చిత్రాలను సీమ వాసులు అమితంగా అభిమానించారు. బాలకృష్ణ నటించిన 'చెన్నకేశవ రెడ్డి', 'సమరసింహా రెడ్డి', 'నరసింహా నాయుడు' వంటి చిత్రాలను కూడా బాగానే ఆదరించారు. ఇలా నందమూరి వంశం పట్ల ప్రత్యేక కృతజ్ఞతాభిమానం చూపించే రాయలసీమ వాసులు తమవైపే ఉన్నారని చాటి చెప్పేందుకు గాను బాలకృష్ణ యాత్రను చేపట్టనున్నారు. అలాగే తెదేపాకు మంచి పట్టున్న ప్రాంతం రాయలసీమ. అయితే.. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంతో పరిస్థితులు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి. మెగాస్టార్ నిర్వహిస్తున్న ప్రజా అంకిత యాత్రకు సీమ వాసులు బ్రహ్మరథం పట్టడమే ఇందుకు నిదర్శనం. దీనికి కౌంటర్‌గా, ధీటుగా బాలయ్య పర్యటన ఉండాలనే కృతనిశ్చయంతో తెదేపా శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. |