|
రాయలసీమలో ప్రజా అంకితయాత్ర నిర్వహిస్తున్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవి యాత్రను భగ్నం చేసేందుకే పులివెందులలో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగినట్టు పీఆర్‌పీ పేర్కొంది. పులివెందులలో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులకు నిరసనగా బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ తెలిపింది.
ఈ విషయమై పీఆర్‌పీ ముఖ్యనేత అల్లు అరవింద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీజీ విగ్రహాల వద్ద పీఆర్‌పీ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ పులివెందులలో తమ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ మూకల దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలు ఏ తీరుగా ఉందో తెలియజెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సొంత ఊరిలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గు చేటని ఆయన అన్నారు. కాంగ్రెస్ మూకలు తమ పార్టీ నేతల పట్ల గూండాల్లా వ్యవహరించారని అరవింద్ విమర్శించారు. తమ ఓపికకు కూడా హద్దు ఉంటుందని ఈ సందర్భంగా అరవింద్ హెచ్చరించారు.
పులివెందులలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పర్యటన కోసం ఆ పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ వర్గీయులుగా పేర్కొనబడుతోన్న కొందరు వ్యక్తులు మంగళవారం దాడులు చేశారు. ఇందులో భాగంగా చిరంజీవి పర్యటన కోసం పీఆర్‌పీ కార్యకర్తలు కట్టిన బ్యానర్లను చింపేసిన దుండగులు వారిపై భౌతిక దాడులు జరిపారు. దీంతో పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
|