|
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీని గద్దె దించే దిశగా ఐటీ నిపుణులు ఛాటింగ్ ప్రచారాన్ని నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్థులను తమ సొంతం చేసుకుని రాష్ట్రాన్ని దివాళా స్థితికి తెచ్చిన వైఎస్‌ను అధికారం నుంచి సాగనంపాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తమ పార్టీకి అనుబంధంగా తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం (టీఎన్ఎన్‌వీ)ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఫోర్‌సాఫ్ట్ కంపెనీ అధినేత పాలెం శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా పుట్టా కిషోర్‌లను చంద్రబాబు నియమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ, బయోటెక్నాలజీ రంగాలను ప్రొత్సహించిన ఘనత తనదేనని చెప్పారు. కలలు కనండి - సాకారం చేసుకోండి అంటూ ఆరోజు తాను చెప్పిన మాటలనే కొందరు నేడు చెప్పకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ఐటీ రంగానికి తామిచ్చిన ప్రోత్సాహం వల్లే ఎందరో గ్రామీణులు ఈ రంగంలో మంచి అభివృద్ధి సాధించారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐటీ రంగంలో రాష్ట్రం సాధించిన ఘనత తమ పుణ్యమేనని ఆయన అన్నారు. ఐటీ నిపుణుడైన శ్రీకాంత్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలను మార్చే ఉద్ధేశ్యంతో టీడీపీలోకి రావడం అభినందించదగ్గ అంశమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ హైటెక్ సీఎం అంటూ దుష్ప్రచారం ద్వారా అప్పట్లో చంద్రబాబును ఓడించారని అన్నారు. అయితే నేడు ఐటీ ఉద్యోగులంతా కలిసికట్టుగా చంద్రబాబును గెలిపించుకునేందుకు ముందుకు వచ్చామని అన్నారు. ఎన్నికలముందు సెలవు పెట్టైనా సరే తెలుగుదేశం గెలుపుకు కృషి చేస్తామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
|