|
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తన ప్రజా అంకిత యాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న రాయలసీమ పర్యటన ఓ ముఖ్య ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సొంత నియోజక వర్గమైన కడప జిల్లాలోని పులివెందులలో బుధవారం చిరంజీవి పర్యటించనున్నారు. దీంతో రాష్ట్ర ప్రజానీకం చూపు మొత్తం పులివెందుల వైపు నిలిచింది.
ప్రస్తుతం అనంతపురం జిల్లాలో తన మూడు రోజుల పర్యటన ముగించుకున్న చిరంజీవి బుధవారం కడప జిల్లా చేరుకోనున్నారు. ఈ క్రమంలో వైఎస్ సొంత ఊరైన బలపనూరు మీదుగా ఆయన పులివెందులకు వెళ్లి రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో ప్రజా అంకితయాత్ర నిర్వహించిన చిరంజీవి రాయలసీమలోనూ తన యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
అదేసమయంలో కోస్తా, తెలంగాణల్లో చిరంజీవి యాత్రకు అన్యూహ్య స్పందన లభించిన తరహాలోనే రాయలసీమలోనూ యాత్ర దిగ్విజయంగా సాగుతుండడం పీఆర్‌పీ వర్గాల్లో ఆనందాన్ని నింపుతోంది. ప్రస్తుతం రాయలసీమలో చివరి అంకానికి చేరుకున్న చిరు యాత్ర పులివెందుల పర్యటన ద్వారా ఓ ముఖ్య అంకాన్ని పూర్తి చేసుకోనుంది.
కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతు ఉన్న పులివెందుల నియోజకవర్గంలో చిరు యాత్ర ఎలా సాగనుంది అన్న విషయంలో ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తుండడం విశేషం. ఈ నేపధ్యంలో చిరు యాత్ర కోసం పులివెందుల్లో మంగళవారం ఏర్పాట్లు చేస్తున్న పీఆర్‌పీ కార్యకర్తలపై కాంగ్రెస్ వర్గీయులుగా పేర్కొనబడుతున్న కొందరు దాడులు చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులను నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద ప్రదర్శనలు జరపనున్నట్టు పీఆర్‌పీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పులివెందులలో చిరంజీవి ప్రజా అంకితయాత్ర ఏ విధంగా కొనసాగనుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
|