ముఖ్యమంత్రి సొంత ఇలాకా పులివెందులలో ప్రజారాజ్యం పార్టీ నేతలపై గూండా గిరి జరిగింది. దీనికి నిరసనగా ప్రరాపా కార్యకర్తలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దాడికి ప్రతిదాడి సమాధానం కాదని చాటి చెపుతూ.. గాంధేయవాద పద్దతిలో ప్రరాపా నేతలు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ప్రరాపా అధినేత మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన ప్రజాఅంకిత యాత్ర బుధవారం కడప జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా పులివెందుల నుంచి చిరంజీవి యాత్ర జరగాల్సి వుంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లలో ప్రరాపా నేతలు, కార్యకర్తలు నిమగ్నమయ్యారు. అయితే మంగళవారం రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలుగా భావించే అల్లరి మూక ఒకటి ప్రరాపా నేతలు, కార్యకర్తలపై దాడులకు దిగింది. కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులను తగులబెట్టారు. ప్రరాపా నేతలు కోటగిరి విద్యాధర రావు, శోభానాగిరెడ్డి, సినీ నిర్మాత ఎన్వీప్రసాద్ తదితరుల కార్లను ధ్వంసం చేశారు. ప్రరాపా కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో దాడులు చేశారు. పులివెందుల గడ్డపై చిరు యాత్రకు ఆటంకాలు కలిగించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడ్డారని ప్రరాపా నేతలు ఆరోపించారు. మరికొన్ని చోట్ల పోలీసులే దగ్గరుండి బ్యానర్లను తగులబెట్టించారని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం పూర్తిగా కాంగ్రెస్ తొత్తుగా వ్యవహరిస్తోందని వారు దుయ్యబట్టారు. ఈ దాడులను ఖండిస్తూ.. ప్రరాపా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. |