|
అది ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కోట. అక్కడ జరిగే ప్రతి సంఘటన ఆయన కనుసన్నల్లో జరుగుతుంది. అక్కడ నివశించే ప్రతి పౌరునికి ఆయన మాటే వేదం. ప్రతి పనివాడు ఆయన అనుచరులు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. అదే పులివెందుల గడ్డ. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాకా. అలాంటి గడ్డపై బుధవారం 'నేల ఈనిందా.. నింగికి చిల్లుపడిందా' అనే రీతిలో జనం పోటెత్తారు.
పులివెందుల నాలుగు కూడలి నాలుగు సముద్రాలు కలిసిన మహా జన సముద్రాన్ని తలపించింది. పులివెందుల వాసులు తనకు బ్రహ్మరథం పట్టడంతో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పులకించి పోయారు. ఇది పులివెందుల గడ్డ కాదని, పూలమాలతో స్వాగతం పలికే గడ్డగా అభివర్ణించారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగించారు.
మంగళవారం రాత్రి ప్రరాపా నేతలపై జరిగిన దాడులను ఖండించారు. హింసకు ప్రతిహింస సమాధానం కాదని చెపుతూనే.. తమ నేతలపై జరిగిన దాడులకు నిరసనగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలకు చిరంజీవి హ్యాట్సాఫ్ చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలకు బెదరవద్దని, ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
|