ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుచూపు మేరలోనే ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నిర్ణయం తీసేసుకుందనే సమాచారం తనకు అందిందని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రెండు జిల్లాల అధ్యక్షుల ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టన్న స్పష్టమైన సంకేతాలు తనకు అందాయని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు ఈ విషయాన్నే చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అదేసమయంలో తెలంగాణ ఏర్పాటు జరిగితే దానికి హైదరాబాదే రాజధానిగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎప్పటికీ తెలంగాణలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ కొందరు చేస్తున్న వాదనలు అర్థరహితమైనవిగా కేసీఆర్ కొట్టిపారేశారు. రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు రానున్న దృష్ట్యా పార్టీ శ్రేణులు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. |