ముఖ్యమంత్రి వైఎస్ సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజారాజ్యం పార్టీ నేతలపై జరిగిన దాడులను ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇందుకోసం పీఆర్పీ న్యాయ సలహా విభాగం ఛైర్మన్ పి.శివశంకర్, సీనియర్ నేత తుమ్మల శ్రీనివాస్, అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్‌లు గురువారం ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు.
తమ పార్టీ అధినేత చిరంజీవి పర్యటన కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వెళ్లిన పార్టీ నేతలు కోటగిరి విద్యాధరరావు, శోభా నాగిరెడ్డి, ఇతర కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలుగా భావిస్తున్న వారు దాడి చేశారని వారు ఫిర్యాదు చేశారు. అనంతరం పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైతాన్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.
పరిస్థితులు ఇలాగే కొనసాగిన పక్షంలో రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహించే పరిస్థితులు ఉండబోవని ఈసీకి వివరించినట్టు చెప్పారు. పులివెందుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చిందన్నారు.
అంతేకాకుండా.. ప్రస్తుతం పులివెందులలో ప్రీపోల్స్ నిర్వహిస్తే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ప్రరాపా నేతలు జోస్యం చెప్పారు. అనంతరం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసిన ప్రరాపా నేతలు దాడి సంఘటనపై ఫిర్యాదు చేశారు. |