|
కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా చేపట్టిన ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్టులో ముఖ్యమంత్రి వైఎస్‌కి వెయ్యి కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిపై ఆయన గురువారం మాట్లాడుతూ.. వైఎస్ నిర్వహిస్తున్న ధనయజ్ఞంలో ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్టు కూడా ఒక భాగమని బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అవినీతి పాలనకు ప్రజలే చరమగీతం పాడేరోజులు దగ్గర పడ్డాయని ఆయన జోస్యం చెప్పారు.
మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్న బాబు ప్రభుత్వ అవినీతిపై నిప్పులు చెరిగారు. పథకాల పేరు చెప్పి వైఎస్ ప్రజలను మభ్యపెడుతున్నారని, వాస్తవంగా క్షేత్ర స్థాయిలో ఏ పథకం సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ఖజనాను దివాలా తీయించిన వైఎస్ అవినీతి ఎల్లలు దాటిపోయిందన్నారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్ అవినీతిపై తప్పకుండా విచారణ జరిపి, ప్రజాకోర్టులో వైఎస్‌ను దోషిగా నిలబెడుతామని ఆయన స్పష్టం చేశారు.
|