వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టడం అనుమానమేనని టీఆర్ఎస్ (ఎన్) అధ్యక్షుడు నరేంద్ర పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ సానుకూల ప్రకటన చేయడమో, ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చడమో చేసే అవకాశాలే ఎక్కువని ఈ సందర్భంగా నరేంద్ర తెలిపారు.
న్యూఢిల్లీలో యూపీఏ ఉప కమిటీ ఛైర్మన్ ప్రణబ్ ముఖర్జీతో గురువారం రాత్రి భేటీ అయిన తర్వాత నరేంద్ర విలేకరులతో సమవేశమ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం పదిరోజుల్లో తెలంగాణ వచ్చేస్తుందన్న వార్తలను నమ్మాల్సిన పనిలేదని అన్నారు.
తాము ఢిల్లీలో తెలంగాణ విషయంలో లాబీయింగ్ చేస్తున్న సంగతి తెలిసే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ తరహా ప్రకటనలు గుప్పిస్తున్నారని నరేంద్ర ఆరోపించారు. తెలంగాణ అశం గురించి కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ కేసీఆర్‌కు ఫోన్ చేయలేదని ఈ సందర్భంగా నరేంద్ర స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీలు కలిసి పోటీచేస్తే కాంగ్రెస్ పని అయిపోయినట్టేనన్న సంగతిని తాము ప్రణబ్‌కు తెలియజేశామని నరేంద్ర పేర్కొన్నారు. తన వాదనను పూర్తిగా అర్ధం చేసుకున్న ప్రణబ్ ఈ విషయమై కోర్ కమిటీలో చర్చించేందుకు సుముఖుత వ్యక్తం చేశారని నరేంద్ర వివరించారు.
అదేసమయంలో గురువారం తాము లోక్‌సభ స్పీకర్ సోమనాధ్‌ను కూడా కలిసి తెలంగాణ గురించి మాట్లాడినట్టు నరేంద్ర పేర్కొన్నారు. |