ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు శనివారం నుంచి తన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు నుంచి ప్రారంభమయ్యే ఈ తొలి విడత యాత్రలో రాష్ట్ర సాధన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తారు. తెలంగాణాలోని అన్ని జిల్లాలను కలుపుతూ సాగే ఈ యాత్ర కోసం తెరాస శ్రేణులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఇదిలావుండగా విధాన నిర్ణయాలు, కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు గాను పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 10 లేదా 11 మంది సీనియర్ నేతలకు స్థానం కల్పించే అవకాశం ఉంది. పార్టీకి, తెలంగాణా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన పదిమంది మేధావులను కూడా పార్టీకి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించనున్నారు. ఇదిలావుండగా తెరాస అధిష్టానంపై గుర్రుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ను కేసీఆర్ ఆహ్వానించి బుజ్జగించారు. ఈయనకు ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ జాతీయ వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతలు, పొలిట్ బ్యూరోలో స్థానం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. |