|
రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గాల్లో కడప దర్గా ఒకటి. ఈ దర్గాను దేశంలోని ప్రముఖులు, వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ తారలు సందర్శిస్తుంటారు. ఆ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా శుక్రవారం ఈ దర్గాను సందర్శించారు. తాను చేపట్టిన ప్రజా అంకిత యాత్రలో భాగంగా.. ఆయన ప్రస్తుతం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఈ పర్యటన చివరి రోజైన శుక్రవారం ఉదయం పది గంటలకు కడప పట్టణంలోని అమీన్‌పీర్ దర్గాను సందర్శించి, ప్రార్థనలు జరిపారు. ఈ దర్గాను చిరు సందర్శించనున్నట్టు వార్తలు రావడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు తరలి వచ్చారు. దీంతో అశేష అభిమాన జనవాహినిని కట్టడి చేయడానికి దర్గా నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి, బందోబస్తు కల్పించారు.
తన పార్టీ నేతలైన కోటగిరి విద్యాధర రావు, ఎంపి సి.రామచంద్రరావు, మాజీ మంత్రి ఖలీల్ భాషాలతో దర్గాకు చేరుకున్న చిరంజీవి.. సుమారు గంట పాటు దర్గాలోనే గడిపారు. అనంతరం అక్కడ నుంచే రోడ్‌షో ను ప్రారంభించి, రాజంపేట మీదుగా బయలుదేరి నారా కోడూరులో ముగించనున్నారు.
|