|
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ పార్టీని తెలంగాణా రాష్ట్ర సమితి మరోమారు నమ్మి మోసపోవద్దని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్.ఇంద్రసేనా రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని పార్టీ అధినేత చంద్రశేఖర రావుకు నమ్మకముంటే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లోనే విలీనం చేయాలని హితవుపలికారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేస్తే ఇక తెరాస అవసరమేముందని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు.
తెలంగాణ విషయంలో ఢిల్లీలో నిర్ణయం జరిగిందని, కాంగ్రెస్‌లోని కీలక నేత ఒకరు తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని కేసీఆర్ అంటున్నారు. ఆయనకు ఫోన్ చేసిన నేత పేరును కేసీఆర్ వెల్లడించాలి అని డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని గొప్పగా చెప్పుకొంటున్న ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిరుపయోగమయ్యే పరిస్థితి వస్తుంటే ఏ మాత్రం పట్టించుకోవట్లేదని భాజపా నేతలు ఆరోపించారు.
|