రానున్న రోజుల్లో కేంద్రంలోనూ ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించనున్నాయని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీల బలం తగ్గుతూ వస్తోందని ఈ నేపధ్యంలో కేంద్రంలోనూ చక్రం తిప్పేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో శుక్రవారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోనూ ప్రాంతీయ పార్టీలు తమ హవా కొనసాగిస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీవారే ప్రధాని పదవి చేపట్టే అవకాశాలున్నాయని అన్నారు.
తమది ప్రాంతీయ పార్టీలైనా అన్ని చోట్లా సంస్కరణలు తీసుకురావడంలో సఫలీకృతం అయ్యామని ఆయన పేర్కొన్నారు. గత 1996 నుంచి లోక్‌సభకు ప్రాంతీయ పార్టీలు తమ ఎంపీలను పంపడం ఎక్కువైందని, ప్రస్తుతం లోక్‌సభలో ప్రాంతీయ పార్టీల బలం 187కు పెరిగిందని ఆయన గుర్తుచేశారు.
ఒక సమయంలో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎక్కువకాలంపాటు కాంగ్రెస్ పార్టీనే అధికారం సాగించినందువల్లే ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కేంద్రంలో ఏక పార్టీ పాలనవల్ల అధికార దుర్వినియోగానికి దారితీసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. |