రాష్ట్ర రాజకీయాల్లోని కుళ్లును, కుతంత్రాలను ప్రక్షాళన చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సరికొత్త మార్పునకు ప్రజారాజ్యం పార్టీ నాంది పలుకుతుందని ఆయన నొక్కివక్కాణించారు. కడప జిల్లాలో మూడోరోజు నిర్వహించిన రోడ్‌షోలో ఆయన భాకరాపేట, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరుల్లో పలు చోట్ల ప్రసంగించారు. ప్రజల గుండెచప్పుడు నుంచి ప్రజారాజ్యం ఆవిర్భవించిందని, అందుకే సూర్యుడి గుర్తును పార్టీ పతాకంలో పొందుపరిచామన్నారు. రాయలసీమ వాసులు తనను తమ కుటుంబ సభ్యుడుకంటే అమితంగా ఆదరిస్తున్నారన్నారు. 'ఇంద్ర' సినిమాలో సీమ గడ్డ ప్రాశస్త్యాన్ని వివరించానని చెప్పారు. ఇదిలావుండగా చిరంజీవి కడప జిల్లాలో మూడోరోజు శుక్రవారం నిర్వహించిన రోడ్‌షో జనంతో పోటెత్తింది. ఆయన బసచేసిన పాస్ట్రాల్ చర్చి నుంచి ఉదయం 11 గంటలకు కనుమలోపల్లె మీదుగా భాకరాపేట చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ సభకు యువకుల కంటే వృద్ధులు అధికంగా రావడమే కాక, ముందుకు దూసుకురావడం తనకు అవధుల్లేని ఆనందాన్నిచ్చిందన్నారు. ఆ తర్వాత కొత్తమాధవరం, ముకుందాశ్రమాల మీదుగా ఒంటిమిట్ట, నందలూరు తదితర ప్రాంతాల్లో చిరంజీవి రోడ్‌షోలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారు. |