ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి రక్తచరిత్రను ప్రత్యేకంగా వివరించనక్కర లేదని ప్రజారాజ్యం పార్టీ ఘాటుగా ఆరోపించింది. దీనిపై ఆ పార్టీ నేతలైన సి.రామచంద్రయ్య, కోటగిరి విద్యాధరరావులు సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం గుప్పించారు. పదవీ వ్యామోహంతో జంట నగరాల్లో మతకలహాలు సృష్టించి రక్తాన్ని చిందింపజేసిన చరిత్ర వైఎస్‌దని వారు ఆరోపించారు.
ఈ ఆరోపణలు తాము చేయడం లేదని, గతంలో కాంగ్రెస్ పార్టీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి పి.చెన్నారెడ్డే స్వయంగా చేసిన విమర్శని వారు గుర్తు చేశారు. అలాంటి చరిత్ర ఉన్న వైఎస్, చిరంజీవి మీసం తిప్పి, తొడకొట్టడాన్ని రౌడీయిజంగా అభివర్ణించడం 'దెయ్యాలు వేదాలు వల్లి'స్తున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు సభా మర్యాదలను మంటకలిపి, అసెంబ్లీలో మీసాలు తిప్పి, తొడకొట్టిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు.
అలాగే మంగంపేట మైనింగ్ యజమానిని హత్య చేసిందెవరో అందరికీ తెలుసని, ఆ తర్వాత వైఎస్‌పై కాల్పులెందుకు జరిగాయో కూడా ప్రజలకు తెలుసన్నారు. ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యముంటే.. పులివెందుల పరిధిలో వచ్చే ఎన్నికలను సీఆర్‌పీఎఫ్ సాయుధ బలగాల ఆధ్వర్యంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ఎవరిసత్తా ఏమిటో తేలుతుందన్నారు. |