భీమ్‌రావ్ బాడ వాసులకు మద్దతు తెలిపిన వివిధ రాజకీయ పార్టీల నేతలను రాజధాని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యాలయమైన గాంధీ భవన్ విస్తరణ కోసం, సమీపంలోని భీమ్‌రావ్ బాడను అధికారులు పోలీసుల అండతో బలవంతంగా ఖాళీ చేయిస్తున్న విషయం తెల్సిందే. ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న వారి ఇళ్ళను కూడా బుల్‌డౌజర్లతో అధికారులు కూల్చి వేయిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, ఇళ్ళ కూల్చివేతను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారందరినీ అరెస్టు చేసి, సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, తెదేపా సీనియర్ నేత విజయరామారావు, పీఆర్పీ యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వామపక్ష, తెరాస తదితరులను అరెస్టు చేశారు.
అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా, భీమ్‌రావుబాడలో పేదల గుడిసెలను కూలగొట్టడం అన్యాయమని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లులు కూలగొట్టడమా! అని ఆయన ప్రశ్నించారు. |