గతంలో సినీ నటుడు బాలకృష్ణ నివాసంలో జరిగిన తుపాకీ కాల్పుల కేసును కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరగతోడింది. ఇందులోభాగంగా ఈ కాల్పులపై పునర్విచారణ జరుపనున్నారు. ఈ మేరకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ప్రసాదరావు వెల్లడించారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం పెండింగ్‌లో ఉందన్నారు.
ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జంట నగరాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు చేపట్టినట్టు చెప్పారు. మహిళలు, యువతులను హేళన చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇకపోతే రాష్ట్ర భద్రత కోసం ఎన్.ఎస్.జి తరహా కమెండోలను తయారు చేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం చలాకీగా ఉండే కొంత మంది పోలీసు యువకులను గుర్తించి, ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరించారు. నగర భద్రతలో భాగంగా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమ పోలీసులు సిద్ధంగా ఉన్నారని కమిషనర్ తెలిపారు. |