యాసిడ్ దాడి కేసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన బీటెక్ విద్యార్థిని స్వప్నిక మృతి చెందింది. బుధవారం తెల్లవారు జామున 5.20 గంటలకు తుది శ్వాస విడిచినట్టు ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలమైన వరంగల్‌కు తరలించనున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రిలో శవపంచనామా అనంతరం స్వప్నిక అంత్యక్రియలు నిర్వహిస్తారు.
వరంగల్‌లోని కిట్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విషయం తెల్సిందే. ఆమె తన స్నహితురాలు ప్రణీతతో కలిసిన స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా శ్రీనివాస్ అనే యువకుడు యాసిడ్ దాడి చేసిన విషయం తెల్సిందే. కేవలం తనను ప్రేమించలేదనే ఏకైక కారణంతో ఈ దాడి జరిగింది. ఈనెల పదో తేదీన జరిగిన దాడి రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తక్షణం స్పందించిన వరంగల్ పోలీసులు నిందితులను పట్టుకుని ఎన్‌కౌంటర్ చేశారు.
ఇదిలావుండగా యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక సికింద్రాబాద్‌లోని యశోదా అస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చింది. రెండు రోజుల నుంచి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా మారడంతో కృత్రిమ శ్వాసను అందిస్తూ వచ్చాయి. అయితే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారి పెరగడం, యాసిడ్ దాడి ప్రభావం మెదడుకు వ్యాపించాయి. దీంతో వైద్యులు ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ స్వప్నికను బతికించ లేకపోయారు. కాగా, స్వప్నిక కుటుంబాన్ని తగిన విధంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. |