ప్రజాసేవ ముసుగులో రాష్ట్రాన్ని దోచుకుతింటున్న కాంగ్రెస్ దోపిడీ దొంగల (పాలకులు)కు వచ్చే ఎన్నికల్లో తగినరీతిలో బుద్ధి చెప్పాలని ప్రజారాజ్యం యువజన విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ విస్తరణ కోసం పేదల బస్తీ భీమ్‌రావ్ బాడను కబ్జా చేసినందుకు నిరసనగా ప్రజారాజ్యం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొని కాంగ్రెస్ పాలకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వైఎస్-డీఎస్ కూటమిని దోపిడీ దొంగలుగా చిత్రీకరించారు. ప్రజలకు సేవ చేస్తామని వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చి మరో ఐదేళ్ళ పాటు రాష్ట్రాన్ని దోచుకోవాలని కలలు కంటున్నారని ఇలాంటి వారిని పంచెలు ఊడిపోయేలా తరిమి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు రాజ్యం పేరుతో.. రైతుల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి అండగా ఆయన మిత్రుడు కేవిపి.రామచంద్రరావు, ఎవరికీ అంతుచిక్కని ఇంగ్లీషు భాషలో మాట్లాడే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, మరో మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి, సీఎంతో లోపాయకారి ఒప్పంద కుదుర్చుకున్న డీఎస్, పేదల ఇళ్లు కూలగొట్టి ముసిముసి నవ్వులు నవ్వే దానం నాగేందర్ ఇలా కాంగ్రెస్ నేతలందరూ దోపిడీ దొంగలుగా మారి రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ఆరోపించారు. |