ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం ఎదుట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలపై చేసిన ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. వీటిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు జూబ్లీహిల్స్‌లోని ఆ పార్టీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేశారు.
కాంగ్రెస్ నేతలను, ముఖ్యమంత్రి వైఎస్‌తో పాటు ఇతర సీనియర్ నేతలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రరాపా కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకోవడంతో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు వర్గాలు తలపడటంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను శాంత పరిచారు. |