ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరానికి సంపూర్ణ సంక్షేమ నామ సంవత్సరంగా కొనియాడారు. ఈ సంవత్సరంలో శాచురేషన్ ప్రాతిపదికన నూటికి నూరుపాళ్ళు ప్రజా ప్రయోజనాలను అందించడానికి విధివిధానాలను రూపొందించామని తెలిపారు.
ఈ ఏడు మార్చి నెల నుంచి అగ్రకుల పేద విద్యార్థులకు నూరు శాతం ఫీజు రియంబర్స్‌మెంట్ చేస్తామని, అదనంగా రైతుల రుణాలు రూ. 30,000 కోట్లు, మహిళలకు పావలా వడ్డీపై రూ. 20,000 కోట్ల రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. గడచిన నాలుగున్నరేళ్లు రాష్ట్రానికి సువర్ణధ్యాయమని, గణనీయమైన అభివృద్ధి జరిగినా రాష్ట్రానికి చేయాల్సింది ఎంతో ఉందని చెప్పారు.
మైనారిటీలు, బీసీలకు సైతం నూరుశాతం ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని చెప్పడానికి తాను గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు.
నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కోరికలు, వారి అవసరాలను నెరవేర్చడమే ప్రభుత్వ ఆశయమైనప్పుడే పరిపాలన ప్రజారంజకమౌతుందని అన్నారు.
ప్రజలు ఏ నమ్మకంతో అధికారం అప్పగించారో ఆ నమ్మకాన్ని మా ప్రభుత్వం చిత్తశుద్దితో నిరూపించుకుందని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం నమ్మకాన్ని వమ్ముచేయదని అన్నారు. దేశం గర్వించదగ్గరీతిలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. |