రాబోయే రోజుల్లో వ్యవసాయానికి మాత్రం విద్యుత్ కోత విధించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంధన శాఖాధికారులకు ఆదేశాలు జారీచేశారు. రిలయన్స్ గ్యాస్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని పేర్కొన్నారు. వేసవిలో విద్యుత్ ఎంతమేర కొనుగోలు చేయాలో వాస్తవిక అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆయన సచివాలయంలో మంత్రులు రోశయ్య, షబ్బీర్ అలీతో కలిసి ఇంధన శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరి 5 నుండి 7 వరకు బొగ్గుగనుల్లో కార్మికుల సమ్మె నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సమస్య రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఎనిమిది రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు చేసుకున్నట్లు అధికారులు సీఎంకు నివేదించారు. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపంతో ఆగిపోయిన 500మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు జనవరి నెలాఖరునాటికి అందుబాటులోకి వస్తాయని జెన్‌కో అధికారులు తెలిపారు.
ట్రాన్స్‌కో 178 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగలుగుతుందని, మరో 20 యూనిట్లు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలావుండగా నాఫ్తాతోపాటు హైస్పీడ్ డీజిల్, ఎల్‌ఎస్‌హెచ్‌ఎస్ ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. |