మరో వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం లిఖించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తాజాగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చే ఎన్నికల ఫలితాలు శుభసూచకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఇద్దరు మంత్రులను ఇంటికి పంపారని, మరో వంద రోజుల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలకులనే తమ ఇళ్ళకు పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంలో రైతులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బాబు తీవ్రంగా ఖండించారు. తమది రైతు రాజ్యమని చెప్పుకుంటున్న వైఎస్ రాష్ట్రాన్ని నియంతగా పాలిస్తూ, రైతులను, ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణవెల్లంలో ఈ రోజు బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అండగా పోరాటం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత ఆయన నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం, బ్రాహ్మణ వెల్లంకు వెళ్లి బాధిత రైతులను శనివారం పరామర్శించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని ఇప్పించాలని, తమకు జరిగిన అన్యాయం గురించి రైతులు బాబుకు వివరించారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను కూడా పరామర్శించారు. |