తొలగించిన మంత్రుల పనితీరు సరిగ్గా లేదని అందువల్లే వారిని తొలగించినట్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల్లో సొంత పార్టీ ఓటమిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఆషామాషీగా తీసుకోరాదని ఆయన నేతలకు హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఇద్దరు రాష్ట్ర మంత్రులు రాజీనామా చేసిన విషయం తెల్సిందే. అయినప్పటికీ ఇప్పట్లో మంత్రివర్గ పునర్‌వ్యస్థీకరణ ఉండబోదని స్పష్టం చేశారు. అంతేకాకుండా వీరి పనితీరి ఘోరంగా ఉండటం వల్లే మంత్రులను తొలగించటం జరిగిందని మొయిలీ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెల్సిందే. జడ్పీటీసీ ఫలితాలు కాంగ్రెస్‌కు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ప్రతిపక్ష పార్టీలు అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించాయి. ముఖ్యంగా మంత్రులు మారెప్ప, మాగంటి బాబు సొంత నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ పరిస్థితి ఎదురు కావడం కాంగ్రెస్ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. |