ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తు ఇంకా ఖరారు కాలేదని తెలంగాణా రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. ఈ దిశగా చర్చలు సాగుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. తెలుగుదేశం, సి.పి.ఎం, సి.పి.ఐలతో ఏర్పాటైన కూటమితో తెలంగాణ రాష్ట సమితి పొత్తు దాదాపుగా ఖరారైందని మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
దీనిపై హరీష్ రావు ఆదివారం స్పందిస్తూ.. తెదేపాతో తమ దోస్తీ ఇంకా ఖరారు కాలేదని, అధికార కాంగ్రెస్‌ను ఓడించే దమ్ముగల పార్టీలతోనే తమ పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకోసం తమతో భావ సారూప్యత కలిగిన పార్టీల నేతలతో చర్చలు సాగుతున్నాయని చెప్పారు. కాగా, జడ్పీటీసీ ఎన్నికల్లో లభించిన విజయంతో తెదేపా-తెరాసలు దోస్తీ పెట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. |