సైకిల్-కారు పొత్తులు దాదాపుగా ఖారారైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు సూత్ర ప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. దీనిపై అధికార ప్రకటన వెలువడటమే తరువాయి. ఈ ప్రకటనను వెల్లడించేందుకు ముహుర్తాన్ని కూడా నిర్ణయించారు. సంక్రాంతి పండగ తర్వాత అంటే.. వచ్చే 21వ తేదీన ఆ ప్రకటన వెలువడనున్నది. ఆ రోజు ఉదయం 10 గంటలకు తెరాస అధినేత కేసీఆర్, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించే సత్తా ఉన్న పార్టీవైపే తాము పొత్తుకు మొగ్గు చూపుతామని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఇవి తెరాస-తెదేపాల మధ్య పొత్తు తథ్యమని తేలిపోయింది. కాగా, ఈ పొత్తుపై తుది నిర్ణయం తీసుకునేందుకు తెరాస నేతల మధ్య ఎన్నో దశలుగా కీలక చర్చలు సాగాయి. ఇటు తెదేపా, అటు ప్రజారాజ్యంలో ఎటువైపు మొగ్గు చూపితే ఏమేర లబ్ధి కలుగుతుందో నిశితంగా పరిశీలించారు. తమ మొగ్గు ఎటువైపో అణుమాత్రం బయటకు పొక్కకుండా ఇటు టిడిపి, అటు పిఆర్పీతో తుది నిర్ణయం తీసుకునేదాకా మంతనాలు కొనసాగించారు. తెలంగాణ సంఘాలతో చర్చల సమయంలో కొందరు ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపినా మెజారిటీ అభిప్రాయం తెదేపా వైపు వెళ్తేనే మంచిదనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అందుకే సైకిల్‌పైనే షికారు చేయాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. |