పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి ఇక రాజకీయ రణక్షేత్రం కానుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు తలపడనున్నారు. ప్రధానంగా.. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పోటీ చేయనున్నట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఆయనపై పోటీకి దింపేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెదేపాలు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి మోహన్‌బాబు, తెదేపా నుంచి శంకర్‌రెడ్డిలు తిరుపతి నుంచి బరిలోకి దిగనున్నారు. తిరుపతి సెగ్మెంట్‌లో బలిజ, కాపు కులస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడి నుంచి పోటీ చేయడమే మంచిదన్న అభిప్రాయమే దీనికి ప్రధాన కారణం. ఇక కాంగ్రెస్ నుంచి సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్‌బాబు పోటీ చేయవచ్చన్న ప్రచారం చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌తో కుటుంబ బంధం కూడా కలిపేసుకున్న తరుణంలో ఆయనకే టిక్కెట్ కేటాయించ వచ్చని తెలుస్తోంది. సినీ రంగంలో మెగాస్టార్ ఆధిపత్యాన్ని సవాల్ చేసిన మోహన్‌బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీనికి తోడు సొంత జిల్లా కావడంతో ఆయనకు అన్నీ అనుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక తెదేపా నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు చిరకాల మిత్రుడైన శంకర్‌రెడ్డి పేరు ఆదివారం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఒకవేళ చిరు అక్కడి నుంచి పోటీ చేస్తే ఆయనపై రోజాను పోటీకి దించాలన్న ప్రతిపాదన ఒక దశలో వచ్చినప్పటికీ, బాబు మాత్రం తన మిత్రుడైన శంకర్‌రెడ్డి వైపే మొగ్గుచూపినట్టు వినికిడి. మొత్తం మీద భక్తులకు ప్రశాంతనిలయంగా పేరొందిన తిరుపతి.. మరో మూడు నెలల్లో రాజకీయ రణక్షేత్రంగా మారనుంది. |