రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ధ్యేయంగా ప్రతి మండలానికీ రూ.10 కోట్ల రుణాలు మంజూరు చేయనున్నట్లు వైఎస్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేసేంత వరకు తమ ప్రభుత్వం నిద్రపోదన్నారు. పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరూ సాటి రాలేరని, నాలుగున్నరేళ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో వచ్చిన వరుస కరువుల వల్ల అప్పులపాలైన రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ పథకాన్ని చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఈ పథకం కింద రూ.11,353 కోట్లు మాఫీ చేసిందని చెప్పారు. అంతేకాకుండా సకాలంలో రుణ బకాయిలు చెల్లించిన రైతాంగానికి సైతం ప్రోత్సాహక బహుమతి రూపేణా రూ.ఐదు వేలు చొప్పున అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. |