ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ధర్మపురి శ్రీనివాస్ సోమవారం ఇచ్చిన అల్పాహార విందుకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో మరోమారు డీఎస్-వైఎస్‌ల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే ముఖ్యమంత్రి మరో అధికారిక కార్యక్రమం ఉన్నందువల్లే ఈ భేటీకీ హాజరుకాలేక పోయారని ఆయన సన్నిహిత వర్గాలు కప్పిపుచ్చుతున్నాయి. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాజయం, ఫలితంగా ఇద్దరు మంత్రుల రాజీనామాల నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళికపై చర్చించేందుకు పార్టీలోని సీనియర్ నేతలతో డీఎస్ తన ఇంటిలో సమావేశం నిర్వహించారు. ఇందులో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వీహెచ్, వెంకటస్వామి, నాదెండ్ల భాస్కరరావు, కేవీపీ.రామచంద్రరావు తదితర సీనియర్లు హాజరయ్యారు. సీఎం మాత్రం హాజరుకాలేదు. ఆయన మరో అధికారిక కార్యక్రమాన్ని సాకుగా చూపి హాజరుకాలేదు. ఎన్నికలు సమీపిస్తున్నందున, పార్టీని ఓడించేందుకు తెదేపా-వామపక్షాలు ఇప్పటికే చేతులు కలిపాయని, తెరాసను తమ పంచన చేర్చుకునేందుకు ఆ కూటమి నేతలు పావులు కదుపుతున్న విషయం తెల్సిందే. దీనికి తోడు ప్రజారాజ్యం పార్టీ ప్రభంజనం జోరుగా ఉంది. ఇలాంటి తరుణంలో తెలంగాణా అంశంపై ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని సీనియర్లు అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందని వారు పేర్కొన్నట్టు సమాచారం. |