రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు పార్టీలన్నీ ఏకం కావడానికి ముహూర్తం దగ్గరపడుతుండటం గమనార్హం. దీంతో మహాకూటమిని ఏర్పాటు చేసుకోవడానికి నాయకులు సిద్దమవుతున్నారు. ఇదివరకే టీడీపీ, వామపక్షాలు జట్టుకట్టిన విషయం విదితమే. కాగా ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర సమితి కూడా ఈ కూటమిలో చేరడానికి సన్నాహాలు ప్రారంభించింది. దీనికి ముహూర్తం సంక్రాంతి తర్వాతేనని తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. సోమవారంనాడు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీపీఐ, సీపీఎం నేతలు నారాయణ, రాఘవులును కేసీఆర్ తన నివాసానికి ఆహ్వానించి తేనీరు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఓడించడంకోసం తామంతా కలిసి పని చేయడానికి సిద్దమౌతామని ఆయన తెలిపారు. కాని మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నానని, అయినా మంచి పనులకు పంతులగారు లేకుండా ఏ పని జరుగదు కదా అంటూ ఈ లోపు మేం అందరం కలిసి చర్చించుకున్నతర్వాతే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఉమ్మడి పోరుతో కాంగ్రెస్ పార్టీని ఎండగడతామని పేర్కొన్నారు. |