నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే వంటింటి సరుకులు కేవలం రూ 100లకే అందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవి ఎన్నికల హామీని ప్రకటించారు. సోమవారం రాత్రి నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ప్రజా అంకిత యాత్రలో భాగంగా చిరంజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తన రెండో రోజుల పర్యటనలో భాగంగా సోమవారం కొనసాగించారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, ముత్తుకూరు మండలాల్లో ఆ తర్వాత జిల్లా కేంద్రంలోను ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రాజ్యమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు హుందాగా బతుకుతున్నారా... లేదే..కూలీలుగా, మెకానిక్‌లుగా, అన్నీ తానై ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడితేనే ఓ సామాన్య రైతు కుంటుంబం దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారన్నారు. ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైయ్యాయని, సామాన్యులు కడుపునిండా తినడానికి తిండి లభించడం లేదని, ఈ పరిస్థితిని చక్కదిద్దడమే ప్రజారాజ్యంపార్టీ ధ్యేయమని వెల్లడించారు. ప్రరాప అధికారంలోకి వస్తే కేవలం రూ 100కే 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ వంటనూనె, 1 కేజీ ఉప్పు, అర కేజీ చింతపండులను ఇస్తామని ఆయన ప్రకటించారు. |