తమ కోరికలు నెరవేర్చాలని కోరుతూ సోమవారం నుండి సమ్మె ప్రారంభించిన లారీ యజమానులు ఈ రోజుకూడా సమ్మెకొనసాగించారు. దీంతో నిత్యావసర సరుకుల రవాణా ఎక్కడికక్కడ స్తంభించింది. తత్ఫలితంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
పెట్రోలు, డీజల్ ధరలను మరింతగా తగ్గించాలని కోరుతూ సమ్మె చేయడం, అలాగే టైర్ల ధరలను కూడా 35 శాతం మేర తగ్గించాలని, టోల్‌ట్యాక్స్ రద్దు, సేవా పన్ను మినహాయింపువంటి పలు డిమాండ్లతో దేశ వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది.
దేశంలోని లారీ యజమానులతో ప్రభుత్వం మూడు దఫాలుగా చర్చలు జరిపినా ఇంతవరకు ఏ ఫలితం కనపడలేదు. కాగా ధరలు ఏ స్థాయికి చేరుకుంటాయోనని ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. సమ్మె కారణంగా దేశంలోని 48 లక్షల వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
ఇదిలావుండగా కేంద్రప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగిస్తామని లారీ యజమానులకు సూచించింది. కాని యజమానులు తమపట్టు విడవకుండా వీలైతే తమ డ్రైవింగ్ లైసెన్సులను సైతం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేస్తామని యజమాన వర్గాలు పేర్కొన్నాయి. |