భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా అది సాధ్యం కాలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి దిగుతామని ఆయన ప్రకటించారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీకి 'కామన్ సింబల్' (ఒకే గుర్తు) వస్తే బాగుంటుందని, దాని కోసం తాము అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు. వచ్చే నెలాఖరు నాటికి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధమవుతామన్నారు. అభ్యర్థులను ఇప్పటికిప్పుడు నిర్ణయించబోమని చిరంజీవి అన్నారు. ఇప్పటి దాకా తాను ఏ అభ్యర్థినీ ప్రకటించలేదని వివరించారు. పార్టీ నేత డాక్టర్ మిత్రాను నెల్లూరు నుంచి అభ్యర్థిగా ప్రకటించినట్లు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. అటువంటి ప్రకటన గాని, నిర్ణయంగాని చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రజారాజ్యం పార్టీకి సంపూర్ణ ప్రజాబలం ఉందని, ప్రత్యర్థి పార్టీలు ఎన్ని అవాంతరాలు కల్పించినా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వంద రూపాయలకు వంట సరుకుల ప్యాకేజీని ప్రకటించే ముందు నిపుణులతో పరిశీలన జరిపినట్లు చిరంజీవి చెప్పారు. అదేవిధంగా తాము అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులపై చర్య తీసుకుంటామని చెప్పారు. |