ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి. ఈ పార్టీ అధినేత తెలుగుదేశం మాజీ నాయకుడు. ఇటీవలి కాలంలో తెలంగాణా ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి. ఇందుకు నిదర్శనమే.. తాజాగా తెలుగుదేశంతో చేతులు కలపడం. ఎవరితో విభేదించి కొత్త పార్టీని స్థాపించారో.. ఆ నాయకుడితోనే చెలిమికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా గత ఎన్నికల నుంచి, నిన్న మొన్నటి వరకు చంద్రబాబును పరుష పదజాలంతో తిట్టి పోసిన కెసీఆర్.. ప్రస్తుతం ఆయనతోనే జతకట్టడం ఆయన నైజానికి నిదర్శనం. అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించటమే ఏకైక లక్ష్యంగా ఆయన తెదేపాతో పొత్తు పెట్టుకున్నారు. అంటే తన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను తుంగలో తొక్కారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కంటే కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించడమే ఆయన లక్ష్యంగా సాగుతోంది. తెలంగాణాలోని ప్రతి వ్యక్తి తెదేపా పొత్తును స్వాగతిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణా వాసుల అభీష్టం మేరకే ఆయన చంద్రబాబుతో చేతులు కలిపారా? అంటే.. ప్రత్యేక రాష్ట్రం రాకపోయినా ఫర్వాలేదా? తాను, తన అనుచరులు మాత్రం హ్యాపీగా ఉంటే చాలన్న ధోరణిని వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. నిండూ మూడు నాలుగు నెలలు నిండని ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతుండగా.. రాజకీయ అనుభవం కలిగి, రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందిన తెరాస మాత్రం ఇందుకు వెనుకంజ వేయడం గమనార్హం. ముఖ్యంగా.. పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఒంటరిగా పోటీ చేయక పోవడం గమనార్హం. అంటే.. తెరాసకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదా? ఒక వేళ ఉన్నా... అంతంతమాత్రమేనా?. ఎందుకంటే.. గత యేడాది తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస ఒంటరిగా పోటీ చేసి పరువు పోగొట్టుకుంది. సాక్షాత్ కేసీఆర్.. పరాజయ కోరల నుంచి బయటపడ్డారు. అందువల్లే.. ఒంటరిగా ఎన్నికల సమరానికి వెళ్లితే తమ సత్తా బయటపడుతుందని భావించిన కేసీఆర్.. ఏమాత్రం సిగ్గూ, లజ్జా లేకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. |