రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానాలపై ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ సురేష్ రెడ్డి అనుమతి నిరాకరించారు. విపక్ష సభ్యులు మాత్రం ఏమాత్రం బెట్టుసడలించక పోవడంతో వారిని సస్పెండ్ చేయాల్సిందిగా రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి రోశయ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో స్పీకర్ పలువురు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.
అప్పటికీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లక పోవడంతో మార్షల్స్ సాయంతో వారిని బయటకు గెంటేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ మార్షల్స్ మధ్య తోపులాట జరిగింది. ఇందులో తెదేపా సభ్యుడు పయ్యావుల కేశవ్ స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.
ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో అసెంబ్లీ లాబీ అద్దాలు, పూలకుండీలు ధ్వంసమయ్యాయి. మార్షల్ అనుసరించిన వైఖరిపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాంతో తెదేపా, ఇతర విపక్ష సభ్యులు వాగ్వివాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అయినప్పటికీ సభలో గొడవ సద్దుమణగక పోవడంతో మహాకూటమి సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేస్తూ మంత్రి రోశయ్య మరో తీర్మానం ప్రవేశపెట్టగా, దీన్ని కూడా స్పీకర్ ఆమోదించారు. |