ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కుమారుడు, వైఎస్.జగన్మోహన రెడ్డికి చెందిన వ్యాపార సంస్థల్లో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో సభా కార్యక్రమాల నుంచి సస్పెండ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
జగన్ సంస్థలో భారీగా అవతకవకలు జరిగాయని, ఇవన్నీ బయటపడుతాయనే నెపంతో విపక్ష సభ్యులను మూకుమ్మడిగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. జగతి సంస్థకు నిధులు సమకూర్చిన సండూర్ పవర్ అంతా బోగస్ మయమని, జాతీయ, అంతర్జాతీయ నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు.
అలాగే రఘురామ్ సిమెంట్ కంపెనీ పెట్టుబడుల వ్యవహారంలో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అందువల్లే గుట్టుచప్పుడు కాకుండా రఘురామ్ సిమెంట్ కంపెనీ పేరును భారతి సిమెంట్స్ కంపెనీగా మార్చారని దుయ్యబట్టారు. సత్యం కుంభకోణంలోనూ ప్రభుత్వ పాత్ర ఉందన్నారు. ఈ అంశాలపై నిజానిజాలు తేలేంత వరకు తాము వదిలి పెట్టబోమన్నారు.
అనంతరం సీపీఎం సభ్యుడు నోముల నర్సింహయ్య మాట్లాడుతూ విపక్ష సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే తమను సభ నుంచి బలవంతంగా బయటకు పంపించి వేశారని ఆరోపించారు. తమపై దాడులు జరిపేందుకు అనువుగా ఉండేందుకు గాను ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ సూచించారని ఆరోపించారు. ఈ ఒక్క సంఘటనతోనే ప్రభుత్వం తప్పు చేసిందనేందుకు రుజువు అని తెరాస సభ్యుడు ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. |