సిద్ధాంత ఐక్యతలేని పార్టీలు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఓడించే ధైర్యంలేని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితి, వామపక్ష పార్టీలు కూటమి పేరుతో కలిశాయనీ, అయితే ఏ పార్టీ కూడా కాంగ్రెస్‌ను ఓడించే దమ్ము లేదని ఘాటుగా స్పందించారు.రంగారెడ్డి జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ పై విధం విపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి వ్యతిరేకమైన సీపీఎం పార్టీని తెరాస అక్కున చేర్చుకోవడంలోనే కూటమి రాజకీయాలు, గద్దెనెక్కేందుకు వారు పడుతున్న పాట్లు ప్రజలకు వెల్లడైందని ఆయన ఎద్దేవా చేశారు.ఇక సినీ నటుడు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కూడా తమను ఏమీ చేయలేదని, తాము అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పట్టం కడతాయని వైఎస్సార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్టీని ఆయన మరోసారి వల్లించారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అగ్రవర్ణ, పేద విద్యార్థులకు ఫీజు రాయితీలు కల్పిస్తామని వైఎస్ హామీనిచ్చారు. |