టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి కూడా రాజకీయ గళం విప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో సినీతారల హవా కొనసాగుతోన్న నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానని సినీనటుడు శ్రీహరి బుధవారం వెల్లడించారు.బుధవారం ఉదయం తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు రెడీ అని శ్రీహరి అన్నారు. ఇటీవల విడుదలైన శ్రీశైలం సినిమా విజయవంతం కావడంతో బుధవారం శ్రీహరి శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేకపూజలు చేశారు.ఇప్పటికే.. రాజశేఖర్ దంపతులు, సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ తరపున ప్రచార బరిలోకి దిగేందుకు సై అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీహరి కూడా ఇదే కోవలో గళం విప్పి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానని మీడియా సమక్షంలో వెల్లడించడం గమనార్హం. |