మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు సోమవారంనాడు రెండు బస్సులకు నిప్పంటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రైల్‌రోకో కార్యక్రమాలు నిర్వహించారు.
నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయిగిరి రైల్వేస్టేషన్ సమీపంలో గోటు వద్ద సోమవారం ఉదయం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పంటించారు.
బస్సులు రైల్వేట్రాక్‌పైనే నిలిచిపోవడంతో ఈ లైన్‌లో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో పక్కన గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను, గూడ్స్ రైలును అడ్డుకుని వారు ధర్నా నిర్వహించారు.
ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ వల్ల మాదిగలకు తీరని అన్యాయం జరుగుతోందంటూ మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో విజిటర్లుగా పాస్‌లు సంపాదించి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా అసెంబ్లీ భవనం పైకెక్కి ఆత్మాహుతి చేసుకుంటామంటూ బెదరించిన విషయం విదితమే.
ఈ మధ్య ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ళపై దాడులు నిర్వహించారు. వారి నివాసాల్లోని వస్తువులు, పూల కుండీలు, కిటికీలు, తలుపులను బద్దలు కొట్టారు. కాగా, రిజర్వేషన్‌ను ఎ,బి,సి,డి విభాగాలుగా వర్గీకరించే వరకూ తమ ఆందోళన ఉధృతంగా కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇదివరకే స్పష్టం చేశారు. |