ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు కేటాయించే విషయంలో కౌంటర్ పిటీషన్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. తమకు ఉమ్మడి గుర్తు కేటాయించాలని కోరుతూ ప్రజారాజ్యం పార్టీ రెండోసారి హైకోర్టు గడప తొక్కిన నేపథ్యంలో కోర్టు ఈ నోటీసులు జారీచేసింది.
ఉమ్మడి గుర్తు కేటాయించాలని కోరుతూ ప్రజారాజ్యం పార్టీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఈసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తమకు ఉమ్మడి గుర్తు కేటాయించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఈసీని ఆదేశించాల్సిందిగా కోరుతూ ప్రజారాజ్యం పార్టీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఈసీని ఆదేశించింది. అదేసమయంలో ప్రజారాజ్యం పిటిషన్‌పై విచారణను ఈనెల 16కు వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.
ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటైన తర్వాత తమ పార్టీకి ఉమ్మడి గుర్తు కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం ప్రజారాజ్యంకు ఉమ్మడి గుర్తు కేటాయించలేమంటూ ఈసీ ఆ అంశాన్ని తోసిపుచ్చింది. దీంతో తమకు ఉమ్మడి గుర్తు కేటాయించాల్సిన ఆవశ్యకత గురించి, ఇంతకుముందు తమలాంటి కొత్త పార్టీలకు ఉమ్మడి గుర్తు కేటాయించిన సందర్భాల గురించి పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీంతో ప్రజారాజ్యంకు ఉమ్మడి గుర్తు కేటాయించే అంశాన్ని పునఃపరిశీలించాల్సిందిగా కోరుతూ ఈసీని హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రజారాజ్యంకు ఉమ్మడి గుర్తు కేటాయించడం వీలుకాదంటూ కొద్దిరోజుల క్రితం ఈసీ మరోసారి తేల్చిచెప్పింది. దీంతో రెండోసారి ప్రజారాజ్యం హైకోర్టును సంప్రదించింది. |