రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న భద్రతా చర్యలపై కేంద్ర హోంశాఖా మంత్రి పి. చిదంబరం హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో భేటీ అనంతరం, ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ... నక్సలైట్ల అణచివేతలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తీవ్రవాదుల ముప్పు మాత్రం ప్రత్యేకమైన సమస్య అనీ.. ఎన్నికల నేపథ్యంలో వారు ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.ఇటీవల నగరంలో జరిగిన గోకుల్ చాట్, మక్కా మసీదు పేలుళ్లను ప్రస్తావించిన హోంమంత్రి... ఈ విషయంలో ఢిల్లీ, ముంబాయిలలో మాదిరిగా క్విక్ రియాక్షన్ టీంలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మార్చి 31 లోగా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచిల మధ్య అనుసంధానం పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.అలాగే రాష్ట్రంలోని కోస్తా తీరంలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు.. మత్స్యకారులకు సెల్‌ఫోన్లను కూడా ఇవ్వాలని చిదంబరం సూచించారు. ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేయాలని అన్నారు.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రస్తావించి హోంమంత్రి... ఐపీఎల్ టోర్నీ సజావుగా సాగేందుకు తాము సహకరిస్తామని, అయితే ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం బలగాలను కేటాయించలేని పరిస్థితి నెలకొందని ఆయన స్పష్టం చేశారు. |