తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చేస్తోన్న హామీలు, వాగ్ధానాలన్నీ... "నేతి బీరకాయ"ల్లాంటివేననీ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎద్దేవా చేశారు. ఆచరణ సాధ్యంకాని వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసేందుకు బాబు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.శుక్రవారం ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఉచిత విద్యుత్ గురించి చంద్రబాబు ఇస్తున్న హామీలు నమ్మశక్యంగా లేవని అన్నారు. పేదలకు ఆర్థిక సహాయం బడ్జెట్ ప్రకారం ఆచరణ సాధ్యం కాదనీ, తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బాబుకు ఈ విషయం తెలియదనుకోవటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.బాబు హామీలన్నీ ఆయన నిరాశా, నిస్పృహలకు సంకేతాలుగా నిలుస్తున్నాయని వైఎస్సార్ పేర్కొన్నారు. పేదలకు ఫించన్ హామీని నెరవేర్చినందుకే రూ. 18 వేల కోట్లు అవసరమవుతాయని... ఇది తెలిసి కూడా బాబు వాగ్ధానం చేయడం ఎవరిని మోసం చేసేందుకని వైఎస్సార్ ప్రశ్నించారు. అందుకే ప్రజలెవరూ బాబు హామీలను నమ్మబోరని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే... ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఈ విషయాన్ని రాజకీయం చేయడం తగదని మందలించారు. ఏ విషయంలోనయినా ఓ పరిమితి ఉంటుందనీ.. దాన్ని అధిగమించటం సబబు కాదనీ.. గాంధీ భవన్ ఘటనపై సీఎం మండిపడ్డారు. ఇకపోతే... మాగంటి బాబు తెదేపాలో చేరడంపై వ్యాఖ్యానించిన వైఎస్సార్... ఓ అసహన వ్యక్తి, మరో అసహన వ్యక్తితో చేతులు కలపడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎవరు ఎన్నిరకాలుగా ఎత్తులు వేసినా, జిమ్మిక్కులు చేసినా, ఎవరు ఎవరితో కలసినా ప్రజల మద్ధతు తమవైపేనని వైఎస్సార్ ధీమా వ్యక్తం చేశారు. |