రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తాను ఇన్నాళ్లు రాసిన 144 బహిరంగ ఉత్తరాలతో కూడిన పుస్తకాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డికి అందజేస్తానని భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఇన్నాళ్లు తాను రాసిన బహిరంగ లేఖలపై ముఖ్యమంత్రి వైఎస్ స్పందించకపోవడం నియంతృత్వమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. అందుకే లేఖలను స్వయంగా ఇవ్వకపోయినా, వీటినన్నింటినీ ఒక పుస్తకంగా రూపొందించి తానే స్వయంగా ఆయనకు అందజేస్తానని చెప్పారు.
హైదరాబాద్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో వైఎస్‌కు దత్తాత్రేయ రాసిన లేఖలతో కూడిన పుస్తకాన్ని ప్రజల కోసం లేఖాస్త్రాలు పేరుతో సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ఇన్నాళ్లు తాను రాసిన లేఖల్ని చదవని వైఎస్ కనీసం ఎన్నికల తర్వాతైనా చదువుకుంటారు అంటూ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాజపా శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు, ప్రజాగాయకుడు గద్దర్, బీజేపీకి చెందిన కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డిలు కూడా పాల్గొన్నారు. |